Monday 2 December 2019

తెలివొచ్చింది - తెలిసొచ్చింది

సమయం: రాత్రి పదిన్నర (10:30pm)

పది ముప్పావుకి పిక్-అప్ వ్యాన్ అందుకోవలసి ఉంది. ఇంటి నుంచి దగ్గరనే బస్ స్టాప్. కడుపు నిండా భోజనం చేసి,మెల్లగా వెళ్ళచ్చులే అని కూర్చొని, ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము.

ఇంతలోకి వ్యాన్ వాడి ఫోన్. తొందరగా రమ్మని. కోపం తో కూడిన అతని స్వరం వినగానే చిర్రెత్తుకొచ్చింది నాకు. అంతే కోపంతో "అదేంటన్నా పది ముప్పావు కి కదా! మీరు తొందరగా వచ్చి మాది ఆలస్యం అయినట్టు అరిస్తే ఎలా?" అని నేను కూడా అరిచాను.
హుటాహుటిన లేచి ఇంట్లో వాళ్ళని కావలించుకొని, బ్యాగ్ లు భుజాన తగిలించుకొని, కాళ్ళకు బూట్లు ఎక్కించుకొని, అన్నయ్య నన్ను బండి పై ఎక్కించుకొని వెళుతుండగా మళ్ళీ ఫోన్.
"ఇంక ఎంత సేపు అన్నా? ఇంకో ఐదు నిమిషాలు చూస్తా, ఆ తర్వాత బస్ ఆగదు ఇంక" అని డ్రైవర్ అరుపులు. నాకు కోపం ఆగలేదు. "ఏంటి బెదిరింపు. ఒక రెండు నిమిషాలు ఆగలేరా? ఉంటే ఉండండి లేకపోతే లేదు. నేను సరాసరి బస్ వచ్చే చోటుకి రాగలను" అని తిరిగి నేనూ బెదిరించాను.
పది ముప్పావు కి వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయాను. వ్యాన్ ఎక్కి వాడి వైపు కోపంగా ఒక లుక్కేసి, సామాన్లని పైన కుక్కేసి, వాచ్ చూసుకొని సరైన టైంకే వచ్చాను అనుకొని గర్వంగా సీటులో కూర్చున్నాను.

సమయం: రాత్రి పదకొండున్నర (11:30pm)

వ్యాన్ దిగి పావు గంట అయింది. బస్ ఇంకా రాలేదు. బరువుగా ఉన్న బ్యాగులను చేతులు మార్చుకుంటూ, బ్యాట్ ఉంటే బాగుండూ అని దోమలు కొట్టుకుంటూ నిలుచున్నాను. దీనికి తోడు నా పై అరిచిన ఆ వ్యాను డ్రైవర్ ని చూసి నా చిరాకు కాస్త కోపంగా మారింది. మనసులో తిట్టుకున్నాను.  ఇంతలోకి ఆ వ్యాను డ్రైవర్ నా దగ్గరికి వచ్చి బస్ రావటానికి ఇంకో పది నిమిషాలు అయినా పడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. కొలిమిలో వేడి నీళ్ళ స్నానం లా అయింది నా పరిస్థితి. కానరాని కోపాన్ని తెప్పించుకొని మరీ తిట్టుకుంటున్నాను. నా కళ్ళు అతనిని అనుసరించ సాగాయి.

ఇంతలోకి అతను కుంటుకుంటూ వ్యాను లోకి ఎక్కి సీటు కింద నుంచి ఎదో కవర్ తీసి, అందులో నుంచి చిన్న డబ్బా తీసి, పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లోని నీళ్ళు వొంపి మొహం కడుక్కొని, కిటికీ నుంచి చేతులు బయటకి పెట్టి చేతులు కడుక్కొని, చల్లగా అయిపోయిన అన్నం ముద్దని, డబ్బాలో పావు వంతు కూడా లేని కూరతో కలిపి, ఇంతలో ఇంటికి ఫోను కలిపి, నవ్వుకుంటూ ముచ్చటిస్తూ, ఖాళీగా ఉన్న కడుపులో ఒక మూలకి సరిపోయే ఆ గిన్నెలోని ముద్దను ఖాళీ చేసి, భుక్తాయాసం పొందిన మనిషి లాగా ఒక చిన్న త్రేపుతో చెయ్యి కడిగేసుకొని, ఫోన్ పెట్టేసి, బయటకి వచ్చి నన్ను చూసి చిన్న నవ్వుతో  "బస్సు వచ్చేసింది!" అంటూ బస్ వైపు చూపించాడు.

బహుశా అతనివి ఆక్రోశపు అరుపులు కావు, ఆకలి అరుపులు. 

No comments:

Post a Comment

కొత్త కాలమానం - ఆపరేషన్ 2020

జననమరణముల నడుమ ఉనికి తెలుపుతూ, బ్రతుకుతెరువు కొరకు గళమునెత్తుతూ, గెలుపు రథమునెక్కుటకు కదము తొక్కుతూ, విధాత రాతను శిరసా వ...