Saturday, 17 June 2017

సాంకేతిక విజ్ఞానం-పరిమితులతో కూడిన జ్ఞానం


సాంకేతిక విజ్ఞానం మనుషులను అనుకోనంతగా అందుకోలేనంత ఎత్తులకు తీసుకెళ్ళింది, ప్రయోజకులను చేసింది.

ఉత్తరాల రాతల తరాల నుండి వాట్సాప్ పలకరింపుల వరకు, గది అంత కంప్యూటర్ల నుండి చేతులలో ఇమిడిపోయే ఫోన్ల వరుకు, చెవులు పిండి చెప్పే బోర్డు పాఠాల నుండి స్విచ్ నొక్కితే వచ్చే స్మార్ట్ పాఠాల వరుకు-- ఇలా  "ఇవి కలలో కూడా జరగవు!" అనుకునే వాటిని ఎన్నిటినో కళ్ళ ముందుకు తెచ్చింది సాంకేతిక విజ్ఞానం. అయితే దీనివల్ల దుష్ప్రయోజనాలూ లేకపోలేదు.

ముఖ్యంగా మన చేతులను ఇట్టే కట్టేసి అట్టా నట్టింట్లో నుంచి "నెట్" ఇంట్లోకి నెట్టేసి ఒక పట్టాన విడువనివ్వక "నట్" బిగించినట్టు అట్టే పట్టేసి చుట్టు పక్కల ఏమి జరుగుంతుందో అంతుపట్టనీయకుండా చేసే చరవాణీలు.
మనిషి తన తోటి వారికి "అరెరే!" అని సహాయపడటం మరిచాడు, చరవాణీలలోని సంఘటనలకు "భళా!" అని స్పందిస్తూ అసలు దారే మరిచాడు.   

తల్లిదండ్రులతో, తోటి స్నేహితులతో, కనీసం తనకోసం తాను సరిగ్గా గడపలేని స్థితి...ఇది మనఃస్థితి కాదు...మన స్థితి...మనం కోరి తెచుకున్న దుస్థితి.
మనం వాడే ఈ ఫేసుబుక్ లు, వాట్సాప్ లు, ఇన్స్టాగ్రాం లు మనకి కొంతలో కొంత...చాలా కొంత మాత్రమే ఉపయోగపడతాయి... "నెట్" ఇంట్లో ఉన్న మనుషులను కాదు, ముందు నట్టింట్లో, నీ చుట్టూ ఉన్న మనుషులను గుర్తించు...   
కళ్ళు నలుపు..పెదవి దుపు.. మాట కలుపు...

మెదడుకు ఇంట్రెస్టు లేకున్నా కళ్ళకు ఇంత రెస్టు కూడా లేకుండా చేసే ఇటువంటి పనులు మరియు  మనపై ఇంతగా ప్రభావం చూపే సాంకేతిక విజ్ఞానం యొక్క పరిమితులను తెలుసుకుంటూ పరిణతితో వాడుకుందాం.

Saturday, 3 June 2017

ఎటు వైపు?! ఆలోచిద్దాం...

"చదువు ఎంతో ముఖ్యం" అంటుంది సమాజం.
"చదువు లేనిదే బ్రతకలేవు" అంటుంది మా గృహం.
"చదువుని ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చెయ్యద్దు" అన్నారు నా గురుదైవం.
"చదువుకోకపోతే నిన్ను ప్రశాంతంగా వదలను!!" అంటుంది నా బ్యాంకు ఋణ భారం.
"చదువు కాక?! ఏంటి నీ దారిక?!" అని నా తోటి వారు నన్ను ప్రశ్నించటం...నెలకొల్పింది నాలో గందరగోళం .
"చదువు నాకు కష్టం,వేరే ఉంది నా ఇష్టం" అంటుంది నా హృదయం.
"అవసరం వేరు, ఇష్టం వేరు...చదువు నీ అవసరం, ఇష్టం నీ బలం" అని చెప్పింది ఓ స్నేహం.   
"చదువుతోనేనా నీ సావాసం?!" త్వరగా తేల్చుకో అంటుంది సమయం.

ఇప్పటికి చదువుతో కావచ్చు నా పయనం!!
కాని తల వంచక, పట్టుదల విడువక చేసే నా ప్రయత్నం
ఖచ్చితంగా నా ఇష్టం వైపే ఉంటుంది నా గమనం.  

నా బోటి వారు ఎందరో, కాని ఇష్టం వైపు నడిచేది కొందరే...
ప్రశాంతంగా ఆలోచిద్దాం... కంగారుపడక! ఇష్టం వైపు అడుగులు వేద్దాం.

Friday, 19 May 2017

"సిరివెన్నెల" గారికి జన్మదిన శుభాకాంక్షలు

అందలేనంత దూరంలోని ఆకాశంలో ఆ "వెన్నెల" ఉండటం ఎంతో అందం.
అందరికీ చేరువలోని సినీ ప్రపంచానికి ఈ "సిరివెన్నెల" దొరకటం ఎంతో ఆనందం.

"నమ్మకమే నాన్న అయ్యి నడపాలిర ఇకపైనా అని చెప్పిOది ...అమ్మ చెప్పింది" అని తండ్రి     కోసం పిల్లవాడు పడే తపన గురించి తెలుపుతూ,
 "మాయలే నమ్మింది,బోయతో పోయింది...పారిపోనీకుండా పట్టుకో నా చేయి" అంటూ  పిల్లల కోసం తపన పడే తండ్రి ఆవేదన గురించి అందించారు.

 "చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా! కిందికొచ్చి నీలా మారిందా" అని తెలుగింటి  ఆడపిల్లలను వర్ణిస్తూ,

"ముసుగు వెయ్యద్దు మనసు మీద,వలలు వెయ్యద్దు వయసు మీద" అంటూ వయసులోని ఆడవారి ఆవేశాన్ని చూపించారు.

  "సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా, విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మంటపాన" అని వధూవరుల గురించి ఎంతో మనోహరముగా ముచ్చటిస్తూ

"వాన విల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో...ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి " అంటూ మన పెళ్ళికథలను యథావిథిగా వినిపించారు.

"ఆనతినీయరా హరా! సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా!" అని అద్వితీయమైన గురుభక్తిని గుర్తుచేస్తూ ,
 "ఆ యపాశమె పూదండవదా నీ మెడలో...శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం అంటూ దైవశక్తిని మనకు అందించి అండగా నిలుచున్నారు.

మీ ఎన్నో ఆలోచనలను ఆచరణలో పెట్టి,ఆ పాటలను మాకు పాఠాలుగా మార్చిన శాస్త్రి గారు!
నాలా క్రొత్తగా కలం పట్టేసి రాసే వారికి పరోక్షంగా తమ రచనల సిరా చుక్కలందిస్తూ, ఎంతగానో ప్రభావితం చేశారు గురువు గారు!

మీ అనంత సాహిత్య విశేష "పద" సామ్రాజ్యంలో నూత్న పదజాలంతో ఎన్నో ఇంద్రజాలాలు చేస్తూ, మమ్మల్ని అన్ని సమయాలలో విస్మయానికి గురిచేసి, ఎన్నో కొత్త దారులు చూపించిన మీ వర్ణనాతీతమైన  సాహిత్యరథానికి ఒక చిన్న తోరణముగా  ఈ చిన్ని రచనను కట్టాలనే నా మనోరథాన్ని మన్నించవలసినదిగా కోరుతూ ...

                                  జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు.  

Monday, 24 April 2017

సచిన్--కోట్ల గుండెల అలికిడి

Image result for sachin childhoodImage result for sachin
ఇప్పుడనే కాదు ఒకప్పుడనే 'గతం'లోకి వెళ్ళినా, అతడికి స్వా'గతం' పలికిన రికార్డులు మరువలేనివి...

చదువు అనేది ఒక ఉత్తమ దారి అయినప్పటికీ క్రికెట్టులో తను అత్యుత్తమంగా ప్రదర్శించగలను అని గ్రహించాడు.   
"పదవ తరగతి తప్పాడు!!" అని తప్పుగా మాట్లాడిన వారి మాటలని తిప్పి కొట్టాడు.
పదహారేళ్ళ ప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు .
తన వృత్తిలోకి వెళ్ళిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో ఘనతలు సాధించాడు. 


వెను తిరగకుండా, మేను బెదరకుండా అతడు ఆడిన "తీరు", సాధించిన "పేరు" వర్ణనాతీతం!
ఇరవై ఎనిమిది ఏళ్ళ అతడి కల, మనందరి కలను నిజం చేసి అతడి బలగం అందరికీ అందించిన "జోరు" అద్భుతం !  
టెస్టులలో, వండేలలో అతడు సృష్టించిన పరుగుల శిఖరాన్ని అధిగమించటం ఎవరి తరం?! 
అందుకనే మన భారతదేశం పురస్కరించింది అతడికి అత్యుత్తమమైన "భారతరత్న " సత్కారం.

పరిచయం అవసరంలేని పేరు, 

అతను కనిపిస్తే జనం జై కొడతారు 
బ్యాటు ఝళిపిస్తే ఆనందంతో ముగ్ధులైపోతారు ...
           
                  "చిన్న"వాడు కాడు ,
                     స"చిన్"వాడు .

                                             కోట్ల మంది మదిలో నిలిచిన సచిన్
                                  కోట్ల ఆశీస్సులను ఒక్క చోట చేర్చి నీకు తల వంచెన్   

Saturday, 8 April 2017

నా మిత్రుడు

అనుకోని పరిస్థితిలో ఎదురైన ఆ సమస్య
తడుముకోకుండా తరిమి కొట్టిన మీ తల్లిదండ్రులకు,అన్నయ్యకు నా పాదాభివందనములు.
నీ వెన్నంటే నిలిచిన మీ పెద్దవారికి నా ధన్యవాదములు.
తమ రక్షణ కర్తవ్యమును నిరూపించుకున్న ఆ వైద్యులకు నా ప్రశంసలు.
భయపడకుండా తనని తాను నమ్మి నిలిచిన నా మిత్రునకు వర్ణించలేని అభినందనలు.

ప్రయత్నించు ప్రయత్నించు,ఎప్పటికీ నీ పట్టుదల విడువక
నువ్వు కోరుకునట్టుగానే ఒక్క నెలలోనే సాగిస్తావు నీ నడక
కుదిరినంత త్వరగానే లేచి పరిగెడతావు దిగులు పడక
నీ పట్టుదలకు తల వంచి వదిలెయ్యదా నిన్ను ఆ పడక 
ఇలా ఎంతో చెప్పాలి అని ఉంది ఉద్వేగంగా,
కాని "మనం అనుకున్నట్టు" కలిసి మాట్లాడుకుందాం తీరికగా...
                 
                                                                                               ఇట్లు,
                                                                                     నీ ప్రియమిత్రుడు ,
                                                                                       స్వరూప్  గోలి.

Wednesday, 5 April 2017

అమ్మ కాని అమ్మ "చెల్లెమ్మ"

అలవాటుగా  "అన్నయ్య" అన్నది అంటే ప్రేమగా మాట్లాడుతుందని అర్థము
పొరపాటుగా  "ఏరా" అన్నది అంటే అది తన కోపానికి చిహ్నము
అపూర్వముగా  "ఏరా అన్నయ్య!!" అని పలికింది అంటే, నీ కష్టాలను పంచుకోటానికి సిధ్ధంగా ఉంది అని తాత్పర్యము .

అమ్మకు పర్యాయపదం, 
             తల్లి తరువాత అంతగా ప్రేమించే పిచ్చి తల్లి, 
                                                           అమ్మ కాని అమ్మ "చెల్లెమ్మ"...

నీతో పోట్లాడుతుంది, కొట్లాడుతుంది 
గెలిస్తే నిన్ను కావాలని ఏడిపిస్తుంది
ఓడిపోతే తట్టుకోలేక ఏడుస్తుంది 
నువ్వు తనపై కోపంగా ఉన్నా తనే వచ్చి హత్తుకుంటుంది
తను నీపై కోపంగా ఉన్నా తనే వచ్చి పలకరిస్తుంది 
రక్షాబంధనమై నీకు ఎప్పటికీ తోడుగా ఉంటుంది

అమ్మ తరువాత అంత ఓపిక కనబరిచి జలదరింపచేస్తుంది
పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతూ కళ్ళు "జల ధరించే"లా చేస్తుంది...

Tuesday, 4 April 2017

వినుడు వినుడు రామాయణ గాధ

రాముడు మంచి బాలుడు కదండీ 
అన్నదమ్ములు అంటే రామ-లక్ష్మణులు లాగ ఉండాలి అంటారు కదండీ
ఆజానుబాహుడు అని రాముడి తోనే పోలుస్తారు కదండీ 
తిరగేసి "మరా" "మరా"  అని చదివినా అదే మహిమ చూపించే  అమృతమైన అమోఘమైన అత్యద్భుతమైన పలుకు "రామ" నే కదండీ 
తన తండ్రి మాట కోసం "వనవాసం" చేస్తూ, వెంట వచ్చిన భార్యతో కలిసి చక్కని  "నివాసం"గా మార్చుకున్న గాధ "సీత-రామ" కథనే కదండీ
కోదండరాముడి కోసం వానరదండుతో అండగా నిలిచి అదే తన శక్తిగా చేసిన రామ-హనుమల భక్తి  వాత్సల్యాలు సాటిలేనివి కదండీ   
మన జీవితానికి ఇన్ని పాఠాలు నేర్పి,అంతంత చేరువై,ఎంతో అచ్చెరువు కలిగించే శ్రీరామచంద్రుడి జన్మదినాన ఏమి చెయ్యగలమండీ

భక్తి శ్రధ్ధలతో రామకోటి రాస్తూ,శతకోటి దండాలు చేస్తూ,అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుందాం రారండీ 

కొత్త కాలమానం - ఆపరేషన్ 2020

జననమరణముల నడుమ ఉనికి తెలుపుతూ, బ్రతుకుతెరువు కొరకు గళమునెత్తుతూ, గెలుపు రథమునెక్కుటకు కదము తొక్కుతూ, విధాత రాతను శిరసా వ...