Wednesday, 1 January 2020

కొత్త కాలమానం - ఆపరేషన్ 2020

What Should an Effective 2020 Ship Implementation Plan ...



జననమరణముల నడుమ ఉనికి తెలుపుతూ,
బ్రతుకుతెరువు కొరకు గళమునెత్తుతూ,
గెలుపు రథమునెక్కుటకు కదము తొక్కుతూ,
విధాత రాతను శిరసా వహిస్తూ,
విలక్షణ విధానాలను విశ్లేషిస్తూ, 
విరాజిల్లు విజ్ఞానాన్ని విశ్వసిస్తూ,
విషపు విషయములను విస్మరిస్తూ,
మనది కాని ఒక కొత్త కాలమానంలో 
మనదిగా మలుచుకునే మనోధైర్యంతో 
గ్రహిస్తూ, జ్వలిస్తూ, మెరుస్తూ నిలుద్దాం.

Monday, 2 December 2019

తెలివొచ్చింది - తెలిసొచ్చింది

సమయం: రాత్రి పదిన్నర (10:30pm)

పది ముప్పావుకి పిక్-అప్ వ్యాన్ అందుకోవలసి ఉంది. ఇంటి నుంచి దగ్గరనే బస్ స్టాప్. కడుపు నిండా భోజనం చేసి,మెల్లగా వెళ్ళచ్చులే అని కూర్చొని, ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము.

ఇంతలోకి వ్యాన్ వాడి ఫోన్. తొందరగా రమ్మని. కోపం తో కూడిన అతని స్వరం వినగానే చిర్రెత్తుకొచ్చింది నాకు. అంతే కోపంతో "అదేంటన్నా పది ముప్పావు కి కదా! మీరు తొందరగా వచ్చి మాది ఆలస్యం అయినట్టు అరిస్తే ఎలా?" అని నేను కూడా అరిచాను.
హుటాహుటిన లేచి ఇంట్లో వాళ్ళని కావలించుకొని, బ్యాగ్ లు భుజాన తగిలించుకొని, కాళ్ళకు బూట్లు ఎక్కించుకొని, అన్నయ్య నన్ను బండి పై ఎక్కించుకొని వెళుతుండగా మళ్ళీ ఫోన్.
"ఇంక ఎంత సేపు అన్నా? ఇంకో ఐదు నిమిషాలు చూస్తా, ఆ తర్వాత బస్ ఆగదు ఇంక" అని డ్రైవర్ అరుపులు. నాకు కోపం ఆగలేదు. "ఏంటి బెదిరింపు. ఒక రెండు నిమిషాలు ఆగలేరా? ఉంటే ఉండండి లేకపోతే లేదు. నేను సరాసరి బస్ వచ్చే చోటుకి రాగలను" అని తిరిగి నేనూ బెదిరించాను.
పది ముప్పావు కి వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయాను. వ్యాన్ ఎక్కి వాడి వైపు కోపంగా ఒక లుక్కేసి, సామాన్లని పైన కుక్కేసి, వాచ్ చూసుకొని సరైన టైంకే వచ్చాను అనుకొని గర్వంగా సీటులో కూర్చున్నాను.

సమయం: రాత్రి పదకొండున్నర (11:30pm)

వ్యాన్ దిగి పావు గంట అయింది. బస్ ఇంకా రాలేదు. బరువుగా ఉన్న బ్యాగులను చేతులు మార్చుకుంటూ, బ్యాట్ ఉంటే బాగుండూ అని దోమలు కొట్టుకుంటూ నిలుచున్నాను. దీనికి తోడు నా పై అరిచిన ఆ వ్యాను డ్రైవర్ ని చూసి నా చిరాకు కాస్త కోపంగా మారింది. మనసులో తిట్టుకున్నాను.  ఇంతలోకి ఆ వ్యాను డ్రైవర్ నా దగ్గరికి వచ్చి బస్ రావటానికి ఇంకో పది నిమిషాలు అయినా పడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. కొలిమిలో వేడి నీళ్ళ స్నానం లా అయింది నా పరిస్థితి. కానరాని కోపాన్ని తెప్పించుకొని మరీ తిట్టుకుంటున్నాను. నా కళ్ళు అతనిని అనుసరించ సాగాయి.

ఇంతలోకి అతను కుంటుకుంటూ వ్యాను లోకి ఎక్కి సీటు కింద నుంచి ఎదో కవర్ తీసి, అందులో నుంచి చిన్న డబ్బా తీసి, పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లోని నీళ్ళు వొంపి మొహం కడుక్కొని, కిటికీ నుంచి చేతులు బయటకి పెట్టి చేతులు కడుక్కొని, చల్లగా అయిపోయిన అన్నం ముద్దని, డబ్బాలో పావు వంతు కూడా లేని కూరతో కలిపి, ఇంతలో ఇంటికి ఫోను కలిపి, నవ్వుకుంటూ ముచ్చటిస్తూ, ఖాళీగా ఉన్న కడుపులో ఒక మూలకి సరిపోయే ఆ గిన్నెలోని ముద్దను ఖాళీ చేసి, భుక్తాయాసం పొందిన మనిషి లాగా ఒక చిన్న త్రేపుతో చెయ్యి కడిగేసుకొని, ఫోన్ పెట్టేసి, బయటకి వచ్చి నన్ను చూసి చిన్న నవ్వుతో  "బస్సు వచ్చేసింది!" అంటూ బస్ వైపు చూపించాడు.

బహుశా అతనివి ఆక్రోశపు అరుపులు కావు, ఆకలి అరుపులు. 

Tuesday, 12 November 2019

లే! పఱుగిడు.


తలవంచక, గురితప్పక,
దూకాక బరిలోకిక!

తలబడుతూ నిలబడుతూ 
పరుగెడుతూ పయనించిక!

గుఱుతులు, విరుపులంటూ  
చెప్పే హేతువులను చాలించిక!

వెఱపు వద్దు, చెరిగె హద్దు,
తగదురన్న తడబాటిక!

తీరిగ్గా తేలిగ్గా 
సాగదు కదా, జీవితము 
చంచలమైంది గనుక!

Saturday, 11 May 2019

జీవనతాత్పర్యం

'భూతభవిష్యములు' అను 
రెండు పర్వతముల నడుమ
సొగసులీనుతున్న 'వర్తమానము' అనే 
పలువొంపుల ప్రవాహము పైన 
నిర్మితమైన 'మనోభావాలు' అనే  
ధృఢమైన వారధిపై 'జ్ఞాపకాలు' అనే 
చల్లని పవనము వీచు వేళ
'జీవితము' అను ప్రకృతిలో లీనమై 
సాగిపోవుటే కదా ఈ 'జీవనతాత్పర్యం'

Tuesday, 26 February 2019

జైహింద్!


చక్కటి దుప్పటిగా కమ్ముకున్న
నల్లటి మబ్బులలో, నిప్పులు కక్కుతూ 
ఊహకు చిక్కని చక్కని వ్యూహం
ముచ్చెమటలు పట్టించిన వైనం
ముప్పుతిప్పలు పెట్టెను 
చిక్కుల క్షిపణుల వర్షం
దిక్కుల నక్కిన 'జైషు'లు నాశనం
"దేశ రక్షణే తక్షణ కర్తవ్యం!"
అంటూ ఉగ్రవాదుల హతం 
చేసిన భారత వైమానిక దళం!

Saturday, 26 January 2019

"పద్మశ్రీ" సిరివెన్నెల సీతారామశాస్త్రి

కేవలం మీ రచనల సిరా చుక్కలతో మమ్మల్ని ఆనదింపజేస్తూ, ఆలోజింపచేస్తూ, కదిలిస్తూ, కట్టిపడేస్తూ, 
తెలుగు సాహిత్య సామ్రాజ్యానికి ఒక చక్రవర్తిగా, 
తెలుగు రచనాకృతిలో దాగి ఉన్న సాహిత్య కిరణాలతో ఉదయించిన అపరదిశనెరుగని భాస్కరుడిగా, 
తెలుగు భాషా వేరులకి పట్టి ఉన్న దుమాధూళిని మీ శైలిలో ప్లావితము చేసి దానిని పూల సువాసనగా మలచి శ్రోతలకు అందించిన కవిహృదయా-

 వరించింది నిన్ను ఈ "పద్మశ్రీ" బిరుదు కోవెల చేరిన పూమాలగా .
 అందుకో ఈ ఘనతను నీ సాహిత్యరథానికి ఒక చిన్న తోరణముగా.

Sunday, 18 November 2018

బలమా!?...భయమా!?

Related image

ప్రశాంతంగా ఉన్న  సాయంకాలాన
అందరూ ఇళ్ళకు తిరిగి వెళుతున్న సమయాన
రాకపోకలు జోరుగా సాగుతున్న దారిలోన
రెండు వాహనాలు ఢీ కొట్టుకున్నవి ఒక వీధి లోన 
తప్పుగా రైట్ సైడ్ వచ్చినవాడు
తనదే రైట్ అని కళ్ళు ఉరిమాడు!
రైట్ గా లెఫ్ట్ సైడ్ వచ్చినవాడు
తప్పు లేకున్నా తప్పుకొని తగ్గిపోయాడు!
ఒకడు "భయపెట్టాను రా!" అని సంబరపడి,
మరొకడు "బతికిపోయాను రా!" అని సంతోషపడి  వెళ్ళిపోయెను!



Thursday, 15 November 2018

నేనున్నా'న్నాన్నా' నే నాన్న!

Related image



"నాన్నా!" అని,
వినిపించిందంటే నీ  గొంతుక!
కోరావంటే కోరిక
కావాలంటే కానుక
తినాలంటే నిండుగా
బ్రతకాలంటే హాయిగా
అడిగేశావంటే ముద్దుగా
అడుగేశావంటే తప్పుగా

సరిచేస్తాడు నీ దారిక
తీర్చేస్తాడు "నో!" అనక
మిగులుస్తాడు ఓ జ్ఞాపిక 
మోసేస్తాడు ఆ మోపిక
ఎంతుందో లో ఓపిక!

Friday, 31 August 2018

అంతే కదండీ!!






యుగాల నుండి వెలసి ఉన్న దేవుళ్ళు 
కోటానుకోట్ల జనాలు
లక్షల నాడీకణాలు కలిసి పుట్టించే ఆలోచనలు
వేల సంఖ్యలలో ఉన్న ఫేసుబుక్ మిత్రులు 
వందల యేళ్ళు బ్రతికే చెట్లు 
వెల కట్టలేని విలువలు. 
ఆపగలవా ఒక మనిషి అంతిమ శ్వాసను!

మరణం అది.. జరుగక తప్పదు!

మరి ఆగునా ఆ దేవుళ్ళ పూజలు
ఈ జనాల పరుగులు 
ఈ ఆలోచనల స్పందనలు  
ఈ మిత్రుల సంభాషణలు  
ఈ చెట్ల జీవన క్రియలు 
ఈ విలువల విలువలు!? 

జీవితం ఇది.. సాగక ఉండదు! 

Thursday, 21 June 2018

చదువు "కుం(కొం)టున్నామా?!"




Related image
చదువు "కుం(కొం)టున్నామా?!"

ఒక విషయాన్ని తట్టుకుంటే అది ఓర్పు
ఓర్పు నశిస్తే కలిగేది బాధ
బాధను దిగమింగుకోలేకపోతే పుట్టేది వేదన
వేదన పెరిగితే మొదలయ్యేది ఆందోళన 
ఆందోళన హెచ్చితే సంభవించేది తిరుగుబాటు

అలాంటి ఓర్పుని పరీక్షించి, బాధని కలిగించి, వేదన పుట్టించి, ఆందోళనపరిచి, ఆఖరికి తిరుగుబాటు కూడా మొదలయ్యేలా చేసిన తరువాత కూడా, అందుకు ప్రేరేపించిన కారణాలను, నిర్ణయాలను కనీసం పరిగణించకుండా, వాళ్ళ మనవిని తొక్కేసి, పిల్లల అభివృధ్ధే ప్రధముగా భావించే  తల్లిదండ్రుల శ్రమదానం నుండి వచ్చిన డబ్బుతో, విద్యార్థులకు ఏ మాత్రం వెసులుబాట్లు కలిపించకుండా మునుపటిలానే సాగిపోదాం అనుకునే ప్రతీ ఒక్క విద్యాసంస్థ కాదు కాదు వ్యాపారసంస్థలకు- ఇది హెచ్చరిక కానే కాదు. మీకు పనికిరాని, అర్థంకాని ఒక సగటు విద్యార్థి వేదన, తల్లిదండ్రులకు చెప్పుకోలేని ఆందోళన. 
ఇందుకు తీవ్ర పరిణామాలను భావి తరాల నుండి ఎదుర్కొనవలసి రావచ్చు. సిధ్ధముగా ఉండగలరు ఆయా సంస్థలవారు


Sunday, 8 April 2018

అందరూ దోషులే దొరికితే!


  
 







ఊహించలేనన్ని కోణాల్లో కుంభకోణాలకు పాల్పడే గొప్పవాళ్ళు!
దర్జాగా యుక్తులతో కుయుక్తులు చేసే మహనీయులు!
తోటి ప్రాణుల్ని తాగిన మైకంలో, బలుపెక్కిన బలంతో హరించే హృత్సారవంతులు! 
"సున్నాలకి కూడా ఇంత విలువ ఉందా?!" అనిపించేలా వేల కోట్ల సొమ్మును అదే పనిగా భుజించే ధనభోజనప్రియులు!
చట్టానికి లోబడకుండా, శిక్షల ఊబిలో పడకుండా, తేలికగా బయటకి వచ్చే సాహసీయులు!
"నన్ను ఎన్నుకున్న వారి నుంచే, నేను సేవ చేసే దేశాన్నీ, రాష్ట్రాన్నే ఎంతో చక్కగా దోచుకుపోతా!" అని చెప్పకనే చెప్పే ప్రతిభావంతులు!

ఎవరు వారు అని వెతకాలా ఎక్కడెక్కడో?! వారికి తోచిన కోణాల్లో సాయం చేస్తూ, ప్రతి ఒక్క నిర్వచనానికి దృష్టాంతముగా ఉంటూ తిరుగుతున్నారుగా ఇక్కడిక్కడే! 

అప్పటి రాజీవ్ గాంధీ గారి నుండి మొదలు ఒక సురేష్ కల్మడి, మన సత్యం గారు, మహనీయులు గాలి జనార్ధన్ , జగన్, విజయ్ మాల్యా, నిరవ్ మోడి, మేహుల్ చోక్సి, చంద కొచ్చర్, నేటి బాలీవుడ్ అంగజుడు సల్లు భాయి వరకు ఎంతో మంది గొప్పవారు
     
  పట్టులో చిక్కిన వారు ఎలాగూ దోషులే... 
       పట్టుబడకుండా నక్కిన వారూ కూడా దోషులే...
  
  అంతం లేని ఇటువంటి సంఘటనలకు కేవలం ఇలా మాత్రమే స్పందించగలిగే ఒక సాటి పౌరుడి వేదన ఇది.

Monday, 12 March 2018

అమ్మ ఒడి!



బడిలో అభ్యసించలేని ఎన్నో విషయాలను నేర్పిస్తుంది ఆ ఒడి
ఎవ్వరూ ఎంచలేనంత ప్రేమను చూపిస్తుంది ఆ ఒడి
ఎంతటి బాధను అయినా ప్రేమగా తుడిచేస్తుంది ఆ ఒడి
తీరని అలసటకి చక్కటి పానుపు అవుతుంది ఆ ఒడి 
ఎక్కెక్కి ఏడ్చేటి కన్నులకు ఊయలగా మారుతుంది ఆ ఒడి
ఏ కష్టాన్ని అయినా పంచుకోగల నేస్తం అవుతుంది ఆ ఒడి 
చిన్న దెబ్బ వేసి అల్లరిని అదుపులో ఉంచే గురువుగా మారుతుంది ఆ ఒడి
ఎన్నో కబుర్లు చెబుతూ, గోరు ముద్దలు తినిపించే ఆ మాతృమూర్తి ఒడి,
పసి పిల్లవాడికైనా, ఎదిగిన పెద్దవాడికైనా ఎప్పటికీ అండగా వెన్నంటే ఉంటుంది ఆ అమ్మ ఒడి! 

Tuesday, 30 January 2018

నిశ్చలుడిని అయినాను!

Image result for child rape line art

https://www.inshorts.com/news/8monthold-critical-after-being-raped-by-28yearold-cousin-1517291735798


ఎవరిని ప్రశ్నించగలను?! 

"రేయ్! లంజకొడకా!!" అని తిడితే తీరిపోని నా ఈ కోపాన్నా?!
" 'అడవిలోనే' క్రూరమృగాలు ఉంటాయి!" అన్నవారి అమాయకత్వాన్నా?!
కామ, క్రోధ, కోరికలతో కప్పుకుపోయిన దరిద్రపు దేహాల్నా?!
చట్టం రూపంలో వెంటనే సంకెళ్ళేసేసిన మన రాజ్యాంగాన్నా?! 
"శతవృధ్ధరూపం ధరించి వార్ధక్యంలో ఉన్న మన చట్టాలు, బంధిఖానాలు మమ్మల్ని ఏమి చెయ్యలేవు!" అనుకునే వాళ్ళ ధైర్యాన్నా?!
"మండలముల వ్యవధిలోనే బయటకి వచ్చి స్వైరవిహారం చెయ్యగలము" అనుకునే  వారి నమ్మకాన్నా?!
"తెలుసుకొని కూడా ఏమి చెయ్యలేకపోతున్నానే!" అన్న నా యేహ్యాన్నా?!
"హు! ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉంటాయి!" అని తోటి వారు కూసినప్పుడు తన్నుకువచ్చే నా ఆవేశాన్నా?! 
ప్రతిబంధకం లేని అర్జునుడిలా ఇలాంటి వారిపై కనీసం శరం కూడా సంధించలేని నా దుస్థితినా?!

ఎవరినని  ప్రశ్నించగలను ?!

కేవలం ఇటువంటి పరిస్థితులకు చలించిపోయి, ఏమి చెయ్యలేని నిస్సహాయ అభాజనుడిగా, ఎంతో మంది అనామకులు పృఛ్ఛించే సమాధానం దొరకని కఠిన ప్రశ్నల్లానే  ఇవి కూడా మిగిలిపోతయ్యేమో?!




Sunday, 22 October 2017

నువ్వు వెన్నువంచి చేసే సాయం -- మన దేశానికి వెన్నంటే ఉండే ధైర్యం

తన కలల వెంట పరుగులెత్తే ఓ కుర్రవాడు
పని కోసం తట్టాబుట్ట సర్దుకొని కుటుంబముతో నగరానికి వచ్చిన ఓ కార్మికుడు
రోజువారి డబ్బు కోసం వేచి చూసే ఓ కూలీవాడు
చికిత్స చేసి బ్రతికించే ఓ వైద్యుడు
వీరత్వంతో దేశాన్ని రక్షించే ఓ సైనికుడు 
కేసులు గెలిస్తే కాని నిద్ర పట్టని ఓ వకీలు
కాసుల కోసం కాచుకొని కూర్చున్న ఓ అవినీతిపరుడు
రెండు పూట్లా ఎన్నో పాట్లు పడితే కాని రోజు గడవని ఓ పేదవాడు
తను చిటిక వేస్తే ఇట్టే పనులు జరిగే ఓ కుబేరుడు
అన్ని వేళలా పుష్టిగా నైవెద్యం అందుకునే ఆ దేవుడు

ఏ పని చేసినా
ఎంతటి వాడైనా
ఎంత కష్టపడినా 
ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా…

నీ శ్రమ లేనిదే మాకు జీవం లేదు
నీ ఓర్పు లేనిదే మానవ మనుగడకు మూలము లేదు
నీ సాయం లేనిదే దేశానికి ముఖ్య ఆదాయం లేదు
నువ్వు చినుకుకై పడే తపనే మా ఉనికికి  కారణం.

తనని బ్రతికించుకునేవాడిని మనిషి అంటే,
పది మందిని బ్రతికించేవాడిని దేవుడు అంటే,

నిన్ను శోషించుకుంటూ, కోట్ల మందిని నీ కష్టంతో పోషించగలిగేది మాత్రం కేవలం నువ్వు ఒక్కడివే... రైతన్నా!!


Monday, 28 August 2017

తెలుగు భాషా దినోత్సవం

"ప్రతిరోజు లాగా ఈ రోజు కూడా మాములేనండీ!!"
ప్రత్యేకత తెలియకుండా అలా అనుకుంటే మాత్రం పొరపాటేనండీ 
మనం పుట్టిన తేదీయా?! మన వాళ్ళ పుట్టిన తేదియా?! అయ్యుండచ్చండీ,
కానీ మన వచనా మాధ్యమానికీ, నా ఈ రచనా మాధ్యమానికీ ఎదో పోలిక ఉందండీ, గమనించండి
అదేనండీ నేడు మన తెలుగు భాషా దినోత్సవమండీ
వ్యవహారిక భాష కోసం పోరాడిన మన "గిడుగు" గారి పుట్టిన తేదీకి గాను దక్కిన అరుదైన గౌరవమండీ!
నాడు "దేశ భాషలందు తెలుగు లెస్స" అని గొప్పతనం చాటారండీ
నేడు "దేశ భాషలందు తెలుగు లెస్సే" అన్న పరిస్థితి ఎదురయ్యేలా ఉందండీ
కానీ మనం ఆ మాటని తిరగరాద్దామండి
అమమ్మాతాతయ్యలని, అమ్మానాన్నలని అడిగి తెలుసుకుందామండీ
ఇతర భాషా పరిజ్ఞానాలు, సంస్కృతులు ఎక్కడైనా నేర్చుకోవచ్చండీ
మన భాషా విలువలకు, సంస్కృతులకు మాత్రం ఇంట్లోనే ఓనమాలు దిద్దగలము కదండీ
సాధ్యమైనంత వరుకు తెలుగులో మాట్లాడటం, కుదిరినప్పుడు రాయటం అలవాటు చేసుకుందామండీ
ఇందులో పెద్ద ఇబ్బందేమి లేదండీ, ఆచరణలో పెడితే ఇట్టే అభ్యాసం అయిపోతుందండీ. 

Friday, 25 August 2017

వినాయక చవితి శుభాకాంక్షలు



పరాయి ఊరి నుండి తమదైన ఊరుకు ప్రయాణమట
ఊరంతటా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణమట
పత్రి,విగ్రహాల కోసం బాజారులలో వెతుకులాటట
"దండాలయ్య!! ఉండ్రాళ్ళయ్య!!" పాట లేని వాడ లేదుట
జ్ఞానం కోసం మనుషులంతా నీ ముందు తీస్తారు గుంజీళ్ళుట
ఉన్నంతలో లోటు పాట్లు ఏమి లేకుండా ఘనంగా పూజలట
ప్రతీ ఇంట్లో నీ కోసం అమ్మ చేతి రకరకాల కమ్మని వంటకాలట
నీ ఎత్తైన విగ్రహాలు పెట్టటం కోసం పోటీలట
నీ ఊరేగింపు సమయంలో తోపులాటలట
ఓ పార్వతీ పుత్రా!! ఓ మహాకాయా!! ఓ విఘ్నేశ్వరా!!
ఏమిటయ్యా ఈ ఆట?!!

అన్నట్టు జన్మదిన శుభాకాంక్షలయ్యా ఓ బొజ్జవినాయకా! 
సరే మరి ఇక ఉంటా! టాటా!

Sunday, 13 August 2017

నవయువతకు స్వాగతం

మార్కులు సరిగ్గా రాక మథనపడి
ర్యాంకుల కోసం ఎంతో ఆరాటపడి                                      
బంధువుల ప్రశ్నలకు తడపడి
ఎన్నో కఠిన సంధర్భాలతో తలపడి
పరీక్షాసమయం అప్పుడు క్రిందామీదా పడి
మంచి కళాశాల కోసం దేవుడి కాళ్ళావేళ్ళా పడి  
మొత్తానికి "హమ్మయ్య!!" అనుకునేంత కష్టపడి 
ఫలితాలు చూసుకొని ఎంతో సంతోషపడి
తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని తెలుసుకొని బాధపడి 

పడి పడి ఉవ్వెత్తున ఎగసిన కెరటంలా
తపస్సు ఫలించిన భగీరథుడిలా
గ్రహణం వీడిన సూర్యుడిలా,
కొండంత ధైర్యంతో, క్రొత్త చిరునవ్వుతో, నిర్దిష్టమైన గమనాలతో, 
ఎన్నో ఆశలతో, ఎన్నెన్నో ఆలోచనలతో
ఈ నవ ప్రపంచానికి విచ్చేసిన అందరికీ
స్వాగతం పలుకుతుంది మన "బిట్స్ పిలాని".

స్వతంత్ర భావాలలో దీనికి సాటి లేదు.
"ఎమైపోతామో?!" అన్న ప్రశ్నకి తావే లేదు.
భవిష్యత్తు గురించి భయం ఎందుకు!!
బాధ్యతగా ఉంటూ, పరిణతితో అడుగు వెయ్యండి ముందుకు.

Monday, 10 July 2017

కలల వలలు

Image result for depression
అలసి వచ్చెను అతను 
తనువు కోరెను కునుకు 
వలస వెళ్ళెను ఆలోచనలు

తలచి చూసెను నయనములు 
కలసి వచ్చెను ఘడియలు
వేచి చూసెను ఇరు సంధ్యలు 
దారిగా మారెను పయనములు
మౌనంగా కరిగెను క్షణములు 
ప్రేమగా మారెను ఎదురుచూపులు 
ఇంటికి చేరెను అడుగులు 
రమ్మని అహ్వానించెను బంధువులు
తనని చుట్టుముట్టెను కన్నీళ్ళు 
చెవులకు వినిపించెను ఆర్తనాదములు
దేవుడిని కోరెను చేతులు 

ధారాళంగా చెమర్చెను  కళ్ళు  
నిద్ర నుంచి లేచెను ఒళ్ళు 
అన్యమనస్కతతో చూసెను దిక్కులు
వలస వెళ్ళిన ఆలోచనలు దరికి రాకూడని పీడకలలు అని తెలిసెను ..

ఉషస్సులోనే చరవాణిలో ఇంటికి చేసి కలిపెను మాటలు
అమ్మ పలుకుతో, నాన్న నవ్వుతో కుదుటపడెను అతని ప్రతిస్పందనలు .

Monday, 3 July 2017

నా చిన్న ప్రపంచం

అది పంతొమ్మిదొందల తొంభై ఏడు --1997
ప్రపంచానికి నేను పరిచయం అయిన నాడు,
            నా ప్రపంచమైన అమ్మ నాన్న అన్నయ్యలను చూసిన నాడు. 

పంతొమ్మిదొందల తొంభై ఎనిమిదవ సంవత్సరం--1998
నా ప్రపంచంలో ఆట వస్తువులు కూడా కలిసిన నాడు,
            నా నవ్వు,ఆనందమే అమ్మ ప్రపంచం అయిన నాడు. 

పంతొమ్మిదొందల తొంభై తొమ్మిదవ సంవత్సరం--1999
నా ప్రపంచానికి బయట వేరే ప్రపంచం ఒకటి ఉందని తెలిసిన నాడు,
           నన్ను వారి ప్రపంచంగా చేసుకున్న అమమ్మ తాతయ్యలను కలిసిన నాడు.  

రెండు వేలు సంవత్సరం--2000
నా ప్రపంచంలో పుట్టిన రోజు మోజుతో కేజీ కేకును కోసిన నాడు, 
           వారి బిజీబిజీ బ్రతుకుల ప్రపంచానికి చిరాకు కలిగిస్తే దెబ్బలు తప్పవని తెలిసిన నాడు.

రెండు వేల ఒకటవ సంవత్సరం--2001
నా ప్రపంచంలోకి స్నేహితులు అనే పదం చేరిన నాడు,
           చిన్న స్కూలు ప్రపంచాన్ని ఒక ముఖ్యమైన ఖండంగా మార్చుకున్న నాడు.

రెండు వేల రెండవ సంవత్సరం--2002
నా ప్రపంచంలోకి పుస్తకాలు,యూనీఫారంలు చేరిన నాడు, 
           ఇంటి ప్రపంచంలోని బీరువాలో ఒక అరను ఆక్రమించిన నాడు.
                   
రెండు వేల మూడవ సంవత్సరం--2003
నా ప్రపంచంలోకి కంప్యూటర్ అనే పరికరాన్ని ఆహ్వానాన్ని పలికిన నాడు,
   ప్రపంచంలోనే సాంకేతిక పరిజ్ఞానం గల పరికరాలకు నాంది పలుకుతున్నారని తెలిసిన నాడు.

రెండు వేల నాలుగవ సంవత్సరం--2004 
నా ప్రపంచాన్ని ఉన్న ఊరు నుండి గుంటూరుకు మార్చిన నాడు,
         మా ఊరును జ్ఞాపకాలతో కూడిన మరో ఖండంగా మార్చుకోవలసివచ్చిన నాడు.

రెండు వేల అయిదవ సంవత్సరం--2005
నా ప్రపంచానికి కొత్త మనుషుల వల్ల విస్తరణ పెరిగిన నాడు,
        ప్రపంచం నేను చేసే పనులను గమనిస్తుందని ఎరిగిన నాడు.

రెండు వేల ఆరవ సంవత్సరం--2006
నా ప్రపంచంలో నాతో గడిపిన అన్నయ్య హాస్టలుకు వెళ్ళిన నాడు,
        బంధువుల ప్రపంచంలోకి ఎక్కువగా నేను మళ్ళిన నాడు.

రెండు వేల ఏడవ సంవత్సరం--2007 
నా ప్రపంచం నుండి అబధ్ధాలు ఎక్కువుగా వినిపిస్తున్న నాడు,
        అమ్మ నాన్నలపై నా దురుసు ప్రవర్తన కనిపిస్తున్న నాడు.

రెండు వేల ఎనిమిదవ సంవత్సరం--2008 
నా ప్రపంచంలో అబ్బాయిలూ అమ్మాయిలకు పక్షపాతం అతిగా కనిపించిన నాడు,
       వారి ప్రపంచానికి దూరంగా ఉండాలని, వారితో మితిగా మెలగాలనిపించిన నాడు. 

రెండు వేల తొమ్మిదవ సంవత్సరం--2009
నా ప్రపంచం నుండి చదువు మెల్లగా దూరమై, తిరుగుడు వేగంగా సమీపించిన నాడు,
       బయట ప్రపంచమంతా నన్ను "అల్లరి పిల్లవాడు"గా సత్కరించిన నాడు.

రెండు వేల పదవ సంవత్సరం--2010
నా ప్రపంచాన్ని గుంటూరు నుండి హాస్టలుకు కదిలించిన  నాడు,
ఇమడలేకపోయిన ఆ ప్రపంచం నుండి బయటకు రావాలని ఏవేవో కథలల్లిన నాడు.                                                                                                                                                 
రెండు వేల పదకొండవ సంవత్సరం--2011 
నా ప్రపంచంలో నాకు పరిచయంలేని ఎవేవో భావాలు,కోరికలు వలన నా దిశలో మార్పులు కలిగిన నాడు,
    "నేను ఏ పని చేసినా తప్పు లేదు!" అన్న అపరిపక్వత దశలో బ్రతుకుతున్న నాడు.                                                                                                                                   
రెండు వేల పన్నెండు,పదమూడు సంవత్సరాలు}--2012,2013
నా ప్రపంచంలో ఈ రెండు సంవత్సరాలు నిజంగా ఎలా గడుస్తున్నాయో,ఏమి చేస్తున్నానో అంతుపట్టని నాడు,
      ప్రపంచానికి నేను మార్కులు,ర్యాంకుల వేటలో ఎంతో కష్టపడుతున్న నాడు. 

రెండు వేల పద్నాలుగవ సంవత్సరం--2014
నా ప్రపంచానికి చుక్కెదురై, ఊహించని మలుపు తిరిగిన నాడు,                                 
ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేకుండా కనుమరుగై, ఊహించిన గెలుపు పొందిన నాడు                                                                                                                                                         
రెండు వేల పదిహేనవ సంవత్సరం--2015
నా ప్రపంచమంతా అనుకున్న చోటికి చేరి,  అరుదైన కళాఖండంగా అనిపించిన నాడు,
 ప్రపంచంలోని ఒక కొత్త ప్రదేశం నా ప్రపంచంలోకి చేరి,మరో అందమైన ఖండంగా  కనిపించిన నాడు.  
రెండు వేల పదహారవ సంవత్సరం--2016 
నా కొత్త ప్రపంచం నాకు మొదటి జీవిత పాఠం నేర్పిన నాడు, 
 ఇరు ప్రపంచాలకి ఉన్న వ్యత్యాసాలను గమనించటానికి తోడ్పడిన నాడు.               
 
రెండు వేల పదిహేడవ సంవత్సరం--2017 
నా ప్రపంచంలో ఎన్నడూ చూడనన్ని ప్రశంసలు అందుకున్న నాడు, 
  ఇప్పుడే మొదలైంది నా అసలు పరుగు సేదతీరకూడదు అని తెలుసుకున్న నాడు.                                                                                        
                         

ఇరవైయేళ్ళ నా చిన్న ప్రపంచంలో--
              
              నేను చూసిన మూడు ఖండాలు, 
              చూడవలసిన మరో నాలుగు ఖండాలు
                                     
               నన్ను అర్థం చేసుకున్న మనుషులు,
               నేను అర్థం చేసుకోని మనుషులు
                                   
             "అయిపోయింది!! ఇంక ఏమి లేదు!!" అని వెనక్కు లాగిన సంర్భాలు, 
             "ఆగిపోయావే?!ఇంకా చాలా ఉంది!!" అని ముందుకు నెట్టిన  సంర్భాలు.                                                                                                                
              ఇరవైయేళ్ళల్లో సాధించిన కలలు ఉన్నాయి ,
              రానున్నఏళ్ళల్లో సాకారంచేసుకోవలసిన కలలు మిగిలున్నాయి. 


                           
                           

                             
   

 


Wednesday, 21 June 2017

"కూర్గ్" విశేషాలు

"అబ్బె" జలపాతం, కూర్గ్.


ఒకే చోట నుండి మొదలైంది మా ప్రయాణం అనుకున్నట్టుగా...
రెండవ సారి వస్తుందో రాదో ఆ అవకాశం తెలియదుగా!...
"మూడు రోజులు మావే!" అన్నట్లు దొరికింది మాకు విరామం ఊహించనట్టుగా! ...
నాలుగు చక్రాల బండిలో బయలుదేరాము మా "టూరు"లోని ఆ ఊరుకు ఎంతో సంతోషంగా...
ఐదు హృదయాలు ఒక చోట చేరిన ఆ వేళ, పలకరించుకున్నాయి స్నేహంగా...
ఆరు గంటలు నిర్విరామంగా గడిచిన ఆ ప్రయాణానికి స్వస్తి పలికి వేడి దుస్తులను ధరించాం అక్కడికి చేరగా..
సప్త స్వరాలను మేళవించిన కోకిల గానంతో నిండింది ఆ చల్లని ప్రదేశం ప్రశాంతంగా 
అష్టదిగ్బంధనం చేసిన పచ్చని చెట్ల మధ్య ఉన్న ఆ వసతిగృహాన్ని చూసి మనసుకు అనిపించింది ఎంతో హాయిగా...
నవరత్నాలు పొదిగిన దైవంలా అనిపించింది మాకు ఆ మేఘాలు మమ్మల్ని కప్పుతుంటే   వేగంగా ...
పది నిముషాల పాటు పరవళ్ళు తొక్కుతున్న ఆ జలపాత సవ్వడులుకు అయ్యాము నిశ్చలముగా...
నలభై ఎనిమిది గంటలు చరవాణీలలో చర్చలు లేకుండా గడిచిపోయాయి ఎంతో తీరికగా...
రోజులు నిముషాలుగా గడిచిన ఆ వాతావరణాన్ని విడిచిపెట్టి వచ్చేశాము దిగులుగా... 

ఎన్నో జ్ఞాపకాలు, మర్చిపోలేని సంఘటనలు, కొత్త ప్రదేశాలు, వైవిధ్య జీవనవిధానాలు, ఊహించని ప్రశాంతత - అన్నిటినీ తనలో పొందుపరుచుకొని తనని కలవటానికి వచ్చే వారిని ఎంతో సులువుగా తన వారిగా తన ప్రకృతి  ఒడిలో ఒదిగిపోయేలా చేసుకోగల ప్రదేశం...
చూడని వారిని రమ్మని తన ఆదేశం...వెళ్ళమని నా సందేశం...ఇది కాదు ఏమి వేరే దేశం...
అది మన భారతదేశంలోని ప్రదేశం... 
              
          "కొడగు" అని అపరిచితమైన పేరు...
                             "కూర్గ్"గా అందరికీ సుపరిచితమైన ఊరు.  

కొత్త కాలమానం - ఆపరేషన్ 2020

జననమరణముల నడుమ ఉనికి తెలుపుతూ, బ్రతుకుతెరువు కొరకు గళమునెత్తుతూ, గెలుపు రథమునెక్కుటకు కదము తొక్కుతూ, విధాత రాతను శిరసా వ...