Monday, 5 December 2016

సహనంతో ఫలితం సాధ్యం - అంచనాలతో అవాంఛనాలు తధ్యం

మనిషికి అంచనాలు చాలా ఎక్కువ.
చేసే ప్రతి పనిలో అంచనాలు.ఉన్న దానితో సంత్రుప్తి పడే రోజులు ఎప్పుడో పోయాయి.
ప్రతి వాడికి ప్రతి విషయంలో అసంత్రుప్తే.
       
              ఒక పిల్లవాడికి అసంత్రుప్తి వాడి ఆట వస్తువులంటే...
              ఒక విద్యార్ధికి అసంత్రుప్తి తన కళాశాలంటే...  
              ఒక స్నేహితుడికి అసంత్రుప్తి తన 'స్నేహ నిర్వచనంకి ' తోటి వారు ఒప్పుకోకుంటే ...
              ఒక ప్రేమికుడికి అసంప్త్రుప్తి తన ప్రియురాలికి ఇచ్చే బహుమతులంటే...  
              ఒక మధ్య తరగతి మనిషికి అసంత్రుప్తి తన సంపాదనంటే...
              ఒక ఉద్యోగికి అసంత్రుప్తి తన జీతం అంటే... 


ఇలా ప్రతి విషయంలో, చేసే ప్రతి పనిలో అంచనాలు పెంచేసుకొని వాటిని చేరుకోలేక అసంత్రుప్తి పడితే, ఆ పనికి అర్థం ఉండదు, ఆ మనిషికి శాంతం ఉండదు, ఆ మనసుకి భారం మాత్రమే మిగులుతుంది.
అలా అని అంచనాలు పెట్టుకోకుండా ఉంటామా?! ఉండగలమా?! అంటే, అవసరంలేదు. ఉండాలి, కుదిరినంత తక్కువ అంచనాలు ఉండాలి. తక్కువ అంచనాలతో పని మొదలు పెడితే, ఆ తరువాత ఫలితాలు ఎలా ఉన్నా ఆనందమే. పెద్దవాళ్ళు అన్నట్టు "అతి ఎందులోనూ పనికిరాదు". ఈ విషయంలో మాత్రం అది ముమ్మాటికి నిజమే. ఒకవేళ అంచనాలు ఎక్కువే ఉండాలి అంటే,దానికి తగినంత కష్టపడాలి అంతే. కానీ ఫలితాలు ఎలా ఉన్నా అప్పుడు స్వీకరించే గుండె ధైర్యం కూడా ఉండాలి. "కష్టే ఫలి" అని మన పెద్దవారు చెప్తారు కదా!!! అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కానీ ఆ ఫలితం ఎప్పుడైనా రావచ్చు. అందుకు తగిన ఓపిక కూడా ఉండాలి.
కావున సహనంతో ఫలితం సాధ్యం, అంచనాలతో అవాంఛనాలు తధ్యం. 

Monday, 28 November 2016

మారాలంటే నీ జీవన కథనం --- మారాలంతే నీ ఆలోచన విధానం

                                మనిషి! ఓ మనిషి!
                                      
                                       చిత్రమైన జీవితం 
                                       వీడలేవు మూర్ఖత్వం

ఏ బిడ్డ పుడుతుందో తెలుసుకోవటానికి స్కాన్నింగ్ లు తీయిస్తావు 
ఆడ బిడ్డ అని తెలిస్తే ఎబాషన్ లు చేయిస్తావు!!!

చదువుకోవాలని నీ పిల్లల్ని బడికి పంపిస్తావు
చదువుకోవాల్సిన పిల్లల్ని పనుల్లో పెడతావు!!!

డబ్బులు సంపాదించటం కోసం ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదువుతావు
పెళ్ళి చేసుకొని కట్నం కోసం భార్యని వేధిస్తావు!!!

పర్యావరణ రక్షణ ఎంతో ముఖ్యం అని పాఠాలు చెప్తావు
అదే పర్యావరణాన్ని పాడుచెయ్యటానికి  నీ వంతు సాయం చేస్తావు!!!

కులాలకు,మతాలకు మేము అతీతం అంటావు
నిన్ను పాలించే వాడిని వాటి నుంచే పుట్టిస్తావు!!!

దోచుకునే వాడితో డీలింగ్ లు చేస్తావు
కష్టపడే  వాడితో బార్గేనింగ్ లు చేస్తావు!!!

కనిపించే దైవం తల్లిదండ్రులు అంటావు
కనిపించకుండా వాళ్ళని వృధ్ధాశ్రమాల్లో వదిలేస్తావు!!!

భారతీయులంతా నా సోదరీసోదరులు అంటావు
ప్రేమించలేదని వాళ్ళ మీద ఆసిడ్ దాడులు చేస్తావు!!!

ఆధునిక యుగం లో ఉన్నా అని గర్వపడతావు
నైతిక విలువలు తెలియకుండా బ్రతికేస్తావు!!!

             ఎక్కడ మనిషి? ఎవ్వరు మనిషి?
        
                                చిత్రమైన జీవితం
                                వీడలేవు మూర్ఖత్వం

Sunday, 27 November 2016

ఆలోచించలేదు "అప్పుడు" --- ప్రశ్నించుకో "ఇప్పుడు"

కోడి కూతలకు మెలుకువ వచ్చే రోజులు అప్పుడు
ఫోను మోతలకు కూడా లేవలేని రోజులు ఇప్పుడు...

సుప్రభాత మాధుర్యాల మధ్య గడిచిన ఉదయాలు అప్పుడు
సుప్రసిధ్ధ "వాట్సాప్"ల మధ్య గడిచే రోజులు ఇప్పుడు...

కోరుకున్న ప్రశాంతత నడుమ గడిచిన బ్రతుకులు అప్పుడు
అర్థం కాని ఉద్రిక్తత నడుమ నిలిచిన బ్రతుకులు ఇప్పుడు... 

ఎప్పుడు చూసినా ఆటలేనా?! అన్న తిట్లు అప్పుడు
అంత ఆపలేని చాటింగులా?! అనే అనుమానాలు ఇప్పుడు...

పరిచయం లేని పెద్దవారికి కూడా గౌరవం ఇచ్చే సంస్కారం అప్పుడు
పాఠాలు చెప్పే గురువలకు కూడా గౌరవం ఇవ్వలేని దుస్థితి ఇప్పుడు...

సంపద అంటే ప్రేమ,బంధం,సంతోషం,ప్రశాంతత,"డబ్బు" అనే నిర్వచనం అప్పుడు 
సంపద అంటే డబ్బు డబ్బు డబ్బు కేవలం "డబ్బే" అనే నిర్వచనం ఇప్పుడు...

నీతి,నిజాయితి అంటే అండగా నిలుచున్న మనుషులు అప్పుడు 
నీతా?!నిజాయితా?! ఇవన్నీ దండగ అని అడ్డదారులు తొక్కుతున్న మనుషులు ఇప్పుడు... 

మానవ వైపరీత్యాలను అడ్డుకున్న వాళ్ళని "నువ్వు మగాడివి రా!!" అన్న రోజులు అప్పుడు 
మానభంగం లాంటి కౄరకృత్యాలకు పాల్పడ్డ వాళ్ళని కూడా "వీడూ మగాడే!!" అని మేపుతున్న రోజులు ఇప్పుడు...


కాలంతో మార్పు సహజం... నిజమే!కాని మనలోని  కనీస విలువలను సైతం మర్చిపోయేంత మార్పా?!అవసరమా?

Tuesday, 11 October 2016

పుట్టుక - ఒక గొప్ప వరం

పుట్టుక - ఒక గొప్ప వరం
అమ్మ - కనిపెంచే, కనిపించే దైవం
నాన్న - నిన్ను ఎప్పటికీ రక్షించే సైనికుడు
అన్న - 'అ 'మ్మలో ఉండే మొదటి సగం అక్షరం, నా 'న్న 'లో ఉండే రెండవ సగం లక్షణం 
తమ్ముడు - నీతో ఎప్పటికీ తోడుగా ఉండే నేస్తం 
సోదరి - అమ్మకు పర్యాయపదం
భార్య - తాళితో మొదలయ్యే బంధం, ఎవరూ విడదీయలేని అనుబంధం
భర్త - తనతో పయనించే బంధానికి ప్రాణ వాయువు, ఆయువు
పిల్లలు - నీ బాధ్యతను నీకు ఎప్పటికీ గుర్తు చేసేవారు 
బంధువులు - వర్షాకాల మేఘాలలాంటివారు, అప్పుడప్పుడు వచ్చి ఆనందపరుస్తారు 
స్నేహితుడు - నీలోని దాగిన లక్షణాలను బయటకుతెచ్చే ఉత్ప్రేరకం
చదువు - నీకు ఎప్పటికీ ఉపయోగపడేది
డబ్బు - మనిషి ప్రాణం పోసేది, ప్రాణం తీసేది
ప్రేమ - వర్ణించలేని ఒక తీయని అనుభూతి 
నమ్మకం - ఇద్దరు మనుషులు కలిసిఉండటానికి,  విడిపోవడానికి సహాయపడేది.
ఆనందం - మానసిక సంతృప్తి వల్ల కలిగేది
బాధ - అంచనాలను అందుకోలేనప్పుడు కలిగేది
మరణం - నీ జీవితంలోని రణాలకు ఆఖరి ఘట్టం 
.... ఈ పుట్టుక నుండి మరణ రణం గురించి 
            చెప్పటానికి 10 నిమిషాలు 
            రాయటానికి 10 వాక్యాలు
            పట్టే ఈ విలువైన  జీవితాన్ని 
            10 కాలాలపాటు  పదిలంగా  
            అందంగా ఆనందంగా గడుపుదాం...... 







  

కొత్త కాలమానం - ఆపరేషన్ 2020

జననమరణముల నడుమ ఉనికి తెలుపుతూ, బ్రతుకుతెరువు కొరకు గళమునెత్తుతూ, గెలుపు రథమునెక్కుటకు కదము తొక్కుతూ, విధాత రాతను శిరసా వ...