Wednesday, 1 January 2020

కొత్త కాలమానం - ఆపరేషన్ 2020

What Should an Effective 2020 Ship Implementation Plan ...



జననమరణముల నడుమ ఉనికి తెలుపుతూ,
బ్రతుకుతెరువు కొరకు గళమునెత్తుతూ,
గెలుపు రథమునెక్కుటకు కదము తొక్కుతూ,
విధాత రాతను శిరసా వహిస్తూ,
విలక్షణ విధానాలను విశ్లేషిస్తూ, 
విరాజిల్లు విజ్ఞానాన్ని విశ్వసిస్తూ,
విషపు విషయములను విస్మరిస్తూ,
మనది కాని ఒక కొత్త కాలమానంలో 
మనదిగా మలుచుకునే మనోధైర్యంతో 
గ్రహిస్తూ, జ్వలిస్తూ, మెరుస్తూ నిలుద్దాం.

Monday, 2 December 2019

తెలివొచ్చింది - తెలిసొచ్చింది

సమయం: రాత్రి పదిన్నర (10:30pm)

పది ముప్పావుకి పిక్-అప్ వ్యాన్ అందుకోవలసి ఉంది. ఇంటి నుంచి దగ్గరనే బస్ స్టాప్. కడుపు నిండా భోజనం చేసి,మెల్లగా వెళ్ళచ్చులే అని కూర్చొని, ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము.

ఇంతలోకి వ్యాన్ వాడి ఫోన్. తొందరగా రమ్మని. కోపం తో కూడిన అతని స్వరం వినగానే చిర్రెత్తుకొచ్చింది నాకు. అంతే కోపంతో "అదేంటన్నా పది ముప్పావు కి కదా! మీరు తొందరగా వచ్చి మాది ఆలస్యం అయినట్టు అరిస్తే ఎలా?" అని నేను కూడా అరిచాను.
హుటాహుటిన లేచి ఇంట్లో వాళ్ళని కావలించుకొని, బ్యాగ్ లు భుజాన తగిలించుకొని, కాళ్ళకు బూట్లు ఎక్కించుకొని, అన్నయ్య నన్ను బండి పై ఎక్కించుకొని వెళుతుండగా మళ్ళీ ఫోన్.
"ఇంక ఎంత సేపు అన్నా? ఇంకో ఐదు నిమిషాలు చూస్తా, ఆ తర్వాత బస్ ఆగదు ఇంక" అని డ్రైవర్ అరుపులు. నాకు కోపం ఆగలేదు. "ఏంటి బెదిరింపు. ఒక రెండు నిమిషాలు ఆగలేరా? ఉంటే ఉండండి లేకపోతే లేదు. నేను సరాసరి బస్ వచ్చే చోటుకి రాగలను" అని తిరిగి నేనూ బెదిరించాను.
పది ముప్పావు కి వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయాను. వ్యాన్ ఎక్కి వాడి వైపు కోపంగా ఒక లుక్కేసి, సామాన్లని పైన కుక్కేసి, వాచ్ చూసుకొని సరైన టైంకే వచ్చాను అనుకొని గర్వంగా సీటులో కూర్చున్నాను.

సమయం: రాత్రి పదకొండున్నర (11:30pm)

వ్యాన్ దిగి పావు గంట అయింది. బస్ ఇంకా రాలేదు. బరువుగా ఉన్న బ్యాగులను చేతులు మార్చుకుంటూ, బ్యాట్ ఉంటే బాగుండూ అని దోమలు కొట్టుకుంటూ నిలుచున్నాను. దీనికి తోడు నా పై అరిచిన ఆ వ్యాను డ్రైవర్ ని చూసి నా చిరాకు కాస్త కోపంగా మారింది. మనసులో తిట్టుకున్నాను.  ఇంతలోకి ఆ వ్యాను డ్రైవర్ నా దగ్గరికి వచ్చి బస్ రావటానికి ఇంకో పది నిమిషాలు అయినా పడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. కొలిమిలో వేడి నీళ్ళ స్నానం లా అయింది నా పరిస్థితి. కానరాని కోపాన్ని తెప్పించుకొని మరీ తిట్టుకుంటున్నాను. నా కళ్ళు అతనిని అనుసరించ సాగాయి.

ఇంతలోకి అతను కుంటుకుంటూ వ్యాను లోకి ఎక్కి సీటు కింద నుంచి ఎదో కవర్ తీసి, అందులో నుంచి చిన్న డబ్బా తీసి, పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లోని నీళ్ళు వొంపి మొహం కడుక్కొని, కిటికీ నుంచి చేతులు బయటకి పెట్టి చేతులు కడుక్కొని, చల్లగా అయిపోయిన అన్నం ముద్దని, డబ్బాలో పావు వంతు కూడా లేని కూరతో కలిపి, ఇంతలో ఇంటికి ఫోను కలిపి, నవ్వుకుంటూ ముచ్చటిస్తూ, ఖాళీగా ఉన్న కడుపులో ఒక మూలకి సరిపోయే ఆ గిన్నెలోని ముద్దను ఖాళీ చేసి, భుక్తాయాసం పొందిన మనిషి లాగా ఒక చిన్న త్రేపుతో చెయ్యి కడిగేసుకొని, ఫోన్ పెట్టేసి, బయటకి వచ్చి నన్ను చూసి చిన్న నవ్వుతో  "బస్సు వచ్చేసింది!" అంటూ బస్ వైపు చూపించాడు.

బహుశా అతనివి ఆక్రోశపు అరుపులు కావు, ఆకలి అరుపులు. 

Tuesday, 12 November 2019

లే! పఱుగిడు.


తలవంచక, గురితప్పక,
దూకాక బరిలోకిక!

తలబడుతూ నిలబడుతూ 
పరుగెడుతూ పయనించిక!

గుఱుతులు, విరుపులంటూ  
చెప్పే హేతువులను చాలించిక!

వెఱపు వద్దు, చెరిగె హద్దు,
తగదురన్న తడబాటిక!

తీరిగ్గా తేలిగ్గా 
సాగదు కదా, జీవితము 
చంచలమైంది గనుక!

Saturday, 11 May 2019

జీవనతాత్పర్యం

'భూతభవిష్యములు' అను 
రెండు పర్వతముల నడుమ
సొగసులీనుతున్న 'వర్తమానము' అనే 
పలువొంపుల ప్రవాహము పైన 
నిర్మితమైన 'మనోభావాలు' అనే  
ధృఢమైన వారధిపై 'జ్ఞాపకాలు' అనే 
చల్లని పవనము వీచు వేళ
'జీవితము' అను ప్రకృతిలో లీనమై 
సాగిపోవుటే కదా ఈ 'జీవనతాత్పర్యం'

Tuesday, 26 February 2019

జైహింద్!


చక్కటి దుప్పటిగా కమ్ముకున్న
నల్లటి మబ్బులలో, నిప్పులు కక్కుతూ 
ఊహకు చిక్కని చక్కని వ్యూహం
ముచ్చెమటలు పట్టించిన వైనం
ముప్పుతిప్పలు పెట్టెను 
చిక్కుల క్షిపణుల వర్షం
దిక్కుల నక్కిన 'జైషు'లు నాశనం
"దేశ రక్షణే తక్షణ కర్తవ్యం!"
అంటూ ఉగ్రవాదుల హతం 
చేసిన భారత వైమానిక దళం!

Saturday, 26 January 2019

"పద్మశ్రీ" సిరివెన్నెల సీతారామశాస్త్రి

కేవలం మీ రచనల సిరా చుక్కలతో మమ్మల్ని ఆనదింపజేస్తూ, ఆలోజింపచేస్తూ, కదిలిస్తూ, కట్టిపడేస్తూ, 
తెలుగు సాహిత్య సామ్రాజ్యానికి ఒక చక్రవర్తిగా, 
తెలుగు రచనాకృతిలో దాగి ఉన్న సాహిత్య కిరణాలతో ఉదయించిన అపరదిశనెరుగని భాస్కరుడిగా, 
తెలుగు భాషా వేరులకి పట్టి ఉన్న దుమాధూళిని మీ శైలిలో ప్లావితము చేసి దానిని పూల సువాసనగా మలచి శ్రోతలకు అందించిన కవిహృదయా-

 వరించింది నిన్ను ఈ "పద్మశ్రీ" బిరుదు కోవెల చేరిన పూమాలగా .
 అందుకో ఈ ఘనతను నీ సాహిత్యరథానికి ఒక చిన్న తోరణముగా.

Sunday, 18 November 2018

బలమా!?...భయమా!?

Related image

ప్రశాంతంగా ఉన్న  సాయంకాలాన
అందరూ ఇళ్ళకు తిరిగి వెళుతున్న సమయాన
రాకపోకలు జోరుగా సాగుతున్న దారిలోన
రెండు వాహనాలు ఢీ కొట్టుకున్నవి ఒక వీధి లోన 
తప్పుగా రైట్ సైడ్ వచ్చినవాడు
తనదే రైట్ అని కళ్ళు ఉరిమాడు!
రైట్ గా లెఫ్ట్ సైడ్ వచ్చినవాడు
తప్పు లేకున్నా తప్పుకొని తగ్గిపోయాడు!
ఒకడు "భయపెట్టాను రా!" అని సంబరపడి,
మరొకడు "బతికిపోయాను రా!" అని సంతోషపడి  వెళ్ళిపోయెను!



కొత్త కాలమానం - ఆపరేషన్ 2020

జననమరణముల నడుమ ఉనికి తెలుపుతూ, బ్రతుకుతెరువు కొరకు గళమునెత్తుతూ, గెలుపు రథమునెక్కుటకు కదము తొక్కుతూ, విధాత రాతను శిరసా వ...