Wednesday, 21 June 2017

"కూర్గ్" విశేషాలు

"అబ్బె" జలపాతం, కూర్గ్.


ఒకే చోట నుండి మొదలైంది మా ప్రయాణం అనుకున్నట్టుగా...
రెండవ సారి వస్తుందో రాదో ఆ అవకాశం తెలియదుగా!...
"మూడు రోజులు మావే!" అన్నట్లు దొరికింది మాకు విరామం ఊహించనట్టుగా! ...
నాలుగు చక్రాల బండిలో బయలుదేరాము మా "టూరు"లోని ఆ ఊరుకు ఎంతో సంతోషంగా...
ఐదు హృదయాలు ఒక చోట చేరిన ఆ వేళ, పలకరించుకున్నాయి స్నేహంగా...
ఆరు గంటలు నిర్విరామంగా గడిచిన ఆ ప్రయాణానికి స్వస్తి పలికి వేడి దుస్తులను ధరించాం అక్కడికి చేరగా..
సప్త స్వరాలను మేళవించిన కోకిల గానంతో నిండింది ఆ చల్లని ప్రదేశం ప్రశాంతంగా 
అష్టదిగ్బంధనం చేసిన పచ్చని చెట్ల మధ్య ఉన్న ఆ వసతిగృహాన్ని చూసి మనసుకు అనిపించింది ఎంతో హాయిగా...
నవరత్నాలు పొదిగిన దైవంలా అనిపించింది మాకు ఆ మేఘాలు మమ్మల్ని కప్పుతుంటే   వేగంగా ...
పది నిముషాల పాటు పరవళ్ళు తొక్కుతున్న ఆ జలపాత సవ్వడులుకు అయ్యాము నిశ్చలముగా...
నలభై ఎనిమిది గంటలు చరవాణీలలో చర్చలు లేకుండా గడిచిపోయాయి ఎంతో తీరికగా...
రోజులు నిముషాలుగా గడిచిన ఆ వాతావరణాన్ని విడిచిపెట్టి వచ్చేశాము దిగులుగా... 

ఎన్నో జ్ఞాపకాలు, మర్చిపోలేని సంఘటనలు, కొత్త ప్రదేశాలు, వైవిధ్య జీవనవిధానాలు, ఊహించని ప్రశాంతత - అన్నిటినీ తనలో పొందుపరుచుకొని తనని కలవటానికి వచ్చే వారిని ఎంతో సులువుగా తన వారిగా తన ప్రకృతి  ఒడిలో ఒదిగిపోయేలా చేసుకోగల ప్రదేశం...
చూడని వారిని రమ్మని తన ఆదేశం...వెళ్ళమని నా సందేశం...ఇది కాదు ఏమి వేరే దేశం...
అది మన భారతదేశంలోని ప్రదేశం... 
              
          "కొడగు" అని అపరిచితమైన పేరు...
                             "కూర్గ్"గా అందరికీ సుపరిచితమైన ఊరు.  

Saturday, 17 June 2017

సాంకేతిక విజ్ఞానం-పరిమితులతో కూడిన జ్ఞానం


సాంకేతిక విజ్ఞానం మనుషులను అనుకోనంతగా అందుకోలేనంత ఎత్తులకు తీసుకెళ్ళింది, ప్రయోజకులను చేసింది.

ఉత్తరాల రాతల తరాల నుండి వాట్సాప్ పలకరింపుల వరకు, గది అంత కంప్యూటర్ల నుండి చేతులలో ఇమిడిపోయే ఫోన్ల వరుకు, చెవులు పిండి చెప్పే బోర్డు పాఠాల నుండి స్విచ్ నొక్కితే వచ్చే స్మార్ట్ పాఠాల వరుకు-- ఇలా  "ఇవి కలలో కూడా జరగవు!" అనుకునే వాటిని ఎన్నిటినో కళ్ళ ముందుకు తెచ్చింది సాంకేతిక విజ్ఞానం. అయితే దీనివల్ల దుష్ప్రయోజనాలూ లేకపోలేదు.

ముఖ్యంగా మన చేతులను ఇట్టే కట్టేసి అట్టా నట్టింట్లో నుంచి "నెట్" ఇంట్లోకి నెట్టేసి ఒక పట్టాన విడువనివ్వక "నట్" బిగించినట్టు అట్టే పట్టేసి చుట్టు పక్కల ఏమి జరుగుంతుందో అంతుపట్టనీయకుండా చేసే చరవాణీలు.
మనిషి తన తోటి వారికి "అరెరే!" అని సహాయపడటం మరిచాడు, చరవాణీలలోని సంఘటనలకు "భళా!" అని స్పందిస్తూ అసలు దారే మరిచాడు.   

తల్లిదండ్రులతో, తోటి స్నేహితులతో, కనీసం తనకోసం తాను సరిగ్గా గడపలేని స్థితి...ఇది మనఃస్థితి కాదు...మన స్థితి...మనం కోరి తెచుకున్న దుస్థితి.
మనం వాడే ఈ ఫేసుబుక్ లు, వాట్సాప్ లు, ఇన్స్టాగ్రాం లు మనకి కొంతలో కొంత...చాలా కొంత మాత్రమే ఉపయోగపడతాయి... "నెట్" ఇంట్లో ఉన్న మనుషులను కాదు, ముందు నట్టింట్లో, నీ చుట్టూ ఉన్న మనుషులను గుర్తించు...   
కళ్ళు నలుపు..పెదవి దుపు.. మాట కలుపు...

మెదడుకు ఇంట్రెస్టు లేకున్నా కళ్ళకు ఇంత రెస్టు కూడా లేకుండా చేసే ఇటువంటి పనులు మరియు  మనపై ఇంతగా ప్రభావం చూపే సాంకేతిక విజ్ఞానం యొక్క పరిమితులను తెలుసుకుంటూ పరిణతితో వాడుకుందాం.

Saturday, 3 June 2017

ఎటు వైపు?! ఆలోచిద్దాం...

"చదువు ఎంతో ముఖ్యం" అంటుంది సమాజం.
"చదువు లేనిదే బ్రతకలేవు" అంటుంది మా గృహం.
"చదువుని ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చెయ్యద్దు" అన్నారు నా గురుదైవం.
"చదువుకోకపోతే నిన్ను ప్రశాంతంగా వదలను!!" అంటుంది నా బ్యాంకు ఋణ భారం.
"చదువు కాక?! ఏంటి నీ దారిక?!" అని నా తోటి వారు నన్ను ప్రశ్నించటం...నెలకొల్పింది నాలో గందరగోళం .
"చదువు నాకు కష్టం,వేరే ఉంది నా ఇష్టం" అంటుంది నా హృదయం.
"అవసరం వేరు, ఇష్టం వేరు...చదువు నీ అవసరం, ఇష్టం నీ బలం" అని చెప్పింది ఓ స్నేహం.   
"చదువుతోనేనా నీ సావాసం?!" త్వరగా తేల్చుకో అంటుంది సమయం.

ఇప్పటికి చదువుతో కావచ్చు నా పయనం!!
కాని తల వంచక, పట్టుదల విడువక చేసే నా ప్రయత్నం
ఖచ్చితంగా నా ఇష్టం వైపే ఉంటుంది నా గమనం.  

నా బోటి వారు ఎందరో, కాని ఇష్టం వైపు నడిచేది కొందరే...
ప్రశాంతంగా ఆలోచిద్దాం... కంగారుపడక! ఇష్టం వైపు అడుగులు వేద్దాం.

కొత్త కాలమానం - ఆపరేషన్ 2020

జననమరణముల నడుమ ఉనికి తెలుపుతూ, బ్రతుకుతెరువు కొరకు గళమునెత్తుతూ, గెలుపు రథమునెక్కుటకు కదము తొక్కుతూ, విధాత రాతను శిరసా వ...